పరిశుద్ధ గ్రంథము

రోమీయులకు 7

Romans 7

చదవడం

రోమీయులకు 7

1

సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంతకాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడు చున్నాను.

🎙 రికార్డ్
2

భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదల పొందును.

🎙 రికార్డ్
3

కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని చేరినయెడల వ్యభిచారిణియన బడును గాని, భర్తచనిపోయినయెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివా హము చేసికొనినను వ్యభిచారిణి కాకపోవును.

🎙 రికార్డ్
4

కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అనువేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మ శాస్త్రము విషయమై మృతులైతిరి.

🎙 రికార్డ్
5

ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను.

🎙 రికార్డ్
6

ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొంది తివిు గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము.

🎙 రికార్డ్
7

కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగాఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.

🎙 రికార్డ్
8

అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.

🎙 రికార్డ్
9

ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.

🎙 రికార్డ్
10

అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను.

🎙 రికార్డ్
11

ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను.

🎙 రికార్డ్
12

కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధ మైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమ మైనదియునై యున్నది.

🎙 రికార్డ్
13

ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను.

🎙 రికార్డ్
14

ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను.

🎙 రికార్డ్
15

ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.

🎙 రికార్డ్
16

ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను.

🎙 రికార్డ్
17

కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.

🎙 రికార్డ్
18

నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.

🎙 రికార్డ్
19

నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.

🎙 రికార్డ్
20

నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.

🎙 రికార్డ్
21

కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది.

🎙 రికార్డ్
22

అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని

🎙 రికార్డ్
23

వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.

🎙 రికార్డ్
24

అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?

🎙 రికార్డ్
25

మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

రోమీయులకు 7

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.